కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు సిద్ధమైన ఓ మహిళ ప్రాణాలను భైంసా బ్లూ కోర్ట్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కాపాడారు. ఈ ఘటన భైంసా టౌన్ పరిధిలోని గడ్డెన్న వాగు వద్ద చోటుచేసుకుంది. సకాలంలో స్పందించి మహిళను రక్షించిన బ్లూ కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ అభినందించారు.
భైంసా టౌన్ పరిధిలో, పెద్ద లింబా గ్రామానికి చెందిన ఒక మహిళ తన కుటుంబ కలహాల కారణంగా, భర్తతో తలెత్తిన తగాదాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఈ విషయం డయల్-100కు సమాచారం అందడంతో, వెంటనే విధుల్లో ఉన్న భైంసా బ్లూ కోర్ట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బ్లూ కోర్ట్ సిబ్బంది, ఆ మహిళను ఆత్మహత్య చేసుకోకుండా సమయానికి అడ్డుకున్నారు. ఆమెను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, ధైర్యం చెప్పి, అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సకాలంలో స్పందించి, ఒక మహిళ ప్రాణాలను కాపాడిన బ్లూ కోర్ట్ సిబ్బంది చరణ్ సేవలను జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సత్వర స్పందన, మానవతా దృక్పథం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటన పోలీసుల సత్వర స్పందనకు, ప్రజలకు అందిస్తున్న సేవలకు నిదర్శనంగా నిలిచింది.











