బాసర, జూలై 8
ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేసేందుకు బాసరలో ప్రత్యేక దరఖాస్తుల భర్తీ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని సక్రమంగా నింపించి సంబంధిత అధికారులకు అందజేశారు. అర్హులైన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా బాసర మండల కేంద్రంలోని బొర్రా గణేష్ గల్లీలో గణేష్ ఆలయం వద్ద మంగళవారం ప్రత్యేక దరఖాస్తుల భర్తీ శిబిరాన్ని నిర్వహించారు. ఉదయం నుంచే ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని సక్రమంగా నింపించి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ బాసర మండల అధ్యక్షుడు కోర్వా శ్యామ్ మాట్లాడుతూ, ప్రత్యేక సవరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దరఖాస్తుల భర్తీలో ఎలాంటి సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైనా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు.
గడువు ముగిసే వరకు ప్రతిరోజూ ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తూ అర్హులైన ప్రతి ఓటరు దరఖాస్తు సక్రమంగా సమర్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అవసరమైన పత్రాలతో శిబిరానికి వచ్చి దరఖాస్తులను పూర్తి చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదవడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని, ఈ అవకాశాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.












