లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైల్డ్ హెల్ప్ లైన్ అధికారి జి. పద్మావతి మాట్లాడుతూ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
పిల్లల భవిష్యత్తు అభివృద్ధికి విద్య అత్యంత ముఖ్యమని, చిన్నారులను పనుల్లో నిమగ్నం చేయకుండా పాఠశాలలకు పంపాలని సూచించారు. సమాజంలో బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
పిల్లలను కార్మికులుగా ఉపయోగించడం చట్ట విరుద్ధమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం లేదా ఫిర్యాదుల కోసం చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ 1098 కు సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లలిత, కార్యదర్శి మాలతి, ఆశ వర్కర్ మంజుల, అంగన్వాడీ టీచర్లు పద్మా, సునీత, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











