తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలను రేపు (బుధవారం) మధ్యాహ్నం వెల్లడించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మార్చి 14న ప్రారంభమై, ఏప్రిల్ 13న ముగిసిన పదో తరగతి పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలు ముగిసిన వెంటనే విద్యా శాఖ మూల్యాంకన ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 23వ తేదీ నాటికి పూర్తయింది.
సాధారణంగా మే మొదటి వారంలో విడుదలయ్యే ఫలితాలను, ఈసారి విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పై చదువుల ప్రవేశాలకు అనువుగా ఏప్రిల్ 29నే విడుదల చేయడానికి అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఆమోదం లభించినట్లు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లలో సులభంగా చూసుకునేలా అన్ని సాంకేతిక ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. మార్కుల నమోదు, సాంకేతిక తనిఖీలు కూడా తుది దశకు చేరుకున్నాయి.








