ప్రణాళికబద్ధంగా సాగితేనే కొలువు సాధ్యం :- ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు డా.ప్రసన్న హరికృష్ణ.
ఆదిలాబాద్: పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే సిలబస్ పై స్పష్టత కలిగి ఉండి ప్రణాళికాబద్ధంగా సన్నద్ధులు కావాలని ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న హరికృష్ణ అన్నారు. మాస్టర్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ గార్డెన్ లో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధులవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహించిన ఉచిత అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసు కొలువులు సాధించాలంటే ఏ విధంగా సన్నద్ధులు కావాలి, ప్రణాళిక ఎలా ఉండాలి, సిలబస్ ను ఏ విధంగా చదవాలి, శిక్షణలో నేర్చుకునే అంశాలను ఏ విధంగా రివిజన్ చేయాలనే దానిపై నిరుద్యోగులకు అవగాహన కల్పించారు. పరీక్షల సన్నద్ధతపై వారికున్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొన్న ప్రస్తుత తరుణంలో కొలువులు సాధించాలంటే స్పష్టమైన ప్రణాళిక ఉండాలన్నారు. పరీక్షలకు సంబంధించిన సిలబస్ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. శిక్షణ కాలం నుంచి పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోను, ఇంటర్నెట్ సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉండాలని సూచించారు. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానాలను రాసేలా ఎప్పటికప్పుడు కసరత్తు చేయాలని పేర్కొన్నారు. సమయాన్ని వృధా చేయకుండా సిలబస్ పై పట్టు సాధించేలా చదవడంతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవాలన్నారు. నేర్చుకున్న అంశాలకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయనే దానిపై ఎప్పటికప్పుడు పున పరిశీలన చేసుకోవాలన్నారు. తద్వారా వెనుకబడిన అంశాలను నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇది పరీక్షల్లో సాధించేందుకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొన్నారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని తమ తల్లిదండ్రుల కలలను సాకారం చేసేలా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీస్ రమణ గౌడ్, పురుషోత్తం రెడ్డి, అల్లం సాయి కృష్ణ, మాస్టర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ రాష్ట్ర పాల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.












