నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం లో కొలువైన అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వివిధ జిల్లాల నుండి, పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఆదివారం ఉదయం నుండే భక్తులు ఆలయానికి చేరుకుని, కోనేటిలో స్నానాదులు ఆచరించి అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిలబడ్డారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయం పరిసరాలు కిటకిటలాడాయి.
అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుండే కాకుండా, మహారాష్ట్రలోని నాందేడ్, నాక్ పూర్, పర్బాని వంటి జిల్లాల నుండి కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ పరిసరాల్లోనే వంటా వార్పు చేసుకుని, కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ సింగం భోజగౌడ, కార్యనిర్వాహణాధికారి (ఈఓ) భూమయ్యలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని ఆలయ అధికారులు తెలిపారు. తాగునీరు, పారిశుధ్యం వంటి సౌకర్యాలను కల్పించారు.












