New Liquor Policy: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ!

New Liquor Policy: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ!

New Liquor Policy: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ!

దరఖాస్తు రుసుం ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంపు

గడువును.. రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచే చాన్స్‌!

‘స్థానిక’ ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు

హైదరాబాద్‌, జూలై 30 రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకరావడానికి రంగం సిద్ధం చేసింది..! స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి పూర్తిచేసే దిశలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ సారి మద్యం వ్యాపార నిబంధనల్లో కూడా కొన్ని కీలక మార్పులు రానున్నాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుమును ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రెండేళ్ల గడువుతో లైసెన్సులు ఇస్తుండగా.. పెంచిన రుసుంకు అనుగుణంగా మూడేళ్ల గడువు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంతోపాటు మంగళవారం కూడా ప్రభుత్వం దీనిపై చర్చించినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వరకు వైన్‌ షాపు(ఏ4)లున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించి.. పోటీ నేపథ్యంలో లాటరీ పద్ధతిన కేటాయిస్తారు. 2023-25 లైసెన్స్‌ కాలానికి ఆ ఏడాది డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. కానీ.. గత ప్రభుత్వం అప్పట్లో మద్యం దుకాణాల కోసం ఆగస్టు 4వ తేదీ నుంచి 18 వరకు దరఖాస్తులను స్వీకరించి.. ఆగస్టు 21న లాటరీ డ్రా నిర్వహించింది. కొత్త పాలసీలో మొత్తం 2,620 మద్యం దుకాణాలను వ్యాపారులకు కేటాయించింది. వీటిలో గౌడ్‌, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కల్పించింది. ఆ దుకాణాల గడువు ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది. అయితే.. సెప్టెంబరులోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉంటాయనే ప్రచారంతో ఈ సారి ఆ ఎన్నికల కంటే ముందే.. దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఎక్సైజ్‌శాఖ యోచిస్తోంది. అంటే.. ఆగస్టులోనే దరఖాస్తుల స్వీకరణను పూర్తిచేసి.. లాటరీ పద్ధతిలో దుకాణాలు కేటాయించడానికి ఎక్సైజ్‌శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల గడువు పెరిగితే.. లిక్కర్‌ దుకాణాల కేటాయింపులో మార్పులు ఉండొచ్చు.

దరఖాస్తులతోనే 3,500కోట్ల ఆదాయం?

దరఖాస్తుల విక్రయాల ద్వారానే భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఎక్సైజ్‌శాఖ భావిస్తోంది. 2023-25 లైసెన్స్‌ కాలానికి కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే రూ.2,460 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని రూ.3,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సారి దరఖాస్తు రుసుమును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఒకేసారి అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. 2019లో చివరిసారిగా దరఖాస్తు రుసుమును పెంచారు. 2015లో రూ.50 వేలు.. 2017లో రూ.లక్షగా ఉన్న రుసుము.. 2019లో రూ.2 లక్షలకు పెరిగింది. 2023లో దీన్నే కొనసాగించగా.. ఆరేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ దరఖాస్తు ఫీజు పెరగనుంది. ఈ పెంపు వల్ల మద్యం వ్యాపారులు నష్టపోకుండా.. లైసెన్సు గడువును పెంచాలని నిర్ణయించింది. అంటే.. గతంలో రూ.2లక్షల ఫీజుతో రెండేళ్ల గడువు ఉండగా.. ఇప్పుడు రూ.3లక్షల ఫీజుకు మూడేళ్ల గడువు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

దుకాణాల సంఖ్య పెరుగుతుందా?

సాధారణంగా జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాల సంఖ్యను నిర్ణయిస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా 2,620 దుకాణాలను కేటాయించారు. జనాభా పెరుగుదలతో దుకాణాల సంఖ్యను పెంచుకోవచ్చు. అయితే.. నిన్నమొన్నటి వరకు ఓఆర్‌ఆర్‌ పరిధిలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలు జీహెచ్‌ఎంసీ లేదా.. సమీప మునిసిపాలిటీలు, మునిసిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దుకాణాల సంఖ్యను పెంచవచ్చా? అనే విషయాన్ని ఎక్సైజ్‌ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఎక్కడ మద్యం దుకాణాన్ని కేటాయిస్తే.. అక్కడే నడుపుకోవాలనే నిబంధన ప్రస్తుతం ఉండగా.. తాజాగా ఆ నిబంధనను సడలించి, ఆ ప్రాంతంలో ఎక్కడికైనా మార్చుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం

Join WhatsApp

Join Now

Leave a Comment