ఇందూరులో వారాహి అమ్మవారి ఆలయానికి నూతన విగ్రహ సేకరణ ప్రారంభం
ఇందూరు, జూలై 16:
ఇందూరు నగరంలోని అమ్మ వెంచర్‌లో ఏర్పాటవుతున్న వారాహి అమ్మవారి ఆలయం అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ నిర్వాహక చైర్మన్ మంచాల జ్ఞానేందర్ నాయకత్వంలో గత సంవత్సరం నుంచి యజ్ఞాలు, హవనాలు, పూజా కార్యక్రమాలు, పీఠాధిపతుల ఆశీస్సులతో ఆలయ పునాది బలపడుతోంది.
ఇటీవల జరిగిన వారాహి మాత నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన తరువాత, ఇప్పుడు పంచలోహ విగ్రహ సేకరణ ప్రారంభమైంది. ఈ క్రమంలో తంజావూరులోని మహిమాన్విత శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన జ్ఞానేందర్, అక్కడ స్వర్ణం మరియు వెండిని అమ్మవారి పాదాల వద్ద ఉంచి, పూజలు నిర్వహించారు.
వారి వివరణలో మాట్లాడుతూ, “ఈ విగ్రహం తయారీకి అమ్మవారి ఆశీస్సులతో పంచలోహను సేకరించాం. ఇది లోక కల్యాణార్థంగా జరుగుతున్న కార్యక్రమం. ఇందూరుకు వారాహి అమ్మవారి రూపం ఆరాధన రూపంలో రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం,” అని భారతి ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపారు.
అలాగే, ఈ ఆలయ నిర్మాణానికి మహిళా భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందిస్తున్న సహకారం అపూర్వమని ఆయన పేర్కొన్నారు.