జోహో నుంచి కొత్త అడుగు — పీఓఎస్ డివైజ్‌లతో డిజిటల్ చెల్లింపుల రంగంలో ప్రవేశం
-
డిజిటల్ పేమెంట్ మార్కెట్లోకి జోహో ప్రవేశం
-
పాయింట్ ఆఫ్ సేల్ (POS) డివైజ్‌లను లాంచ్ చేసిన సంస్థ
-
త్వరలో అరట్టై యాప్‌తో జోహో పే లింక్ కానుంది
ఫిన్‌టెక్ రంగంలో మరో సంచలనం సృష్టించేందుకు జోహో సంస్థ ముందుకొచ్చింది. సంస్థ పాయింట్ ఆఫ్ సేల్ (POS) డివైజ్‌లను విడుదల చేసింది. త్వరలో వీటిని దేశీయ మెసేజింగ్ యాప్ అరట్టైతో అనుసంధానం చేయనున్నట్లు వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. డిజిటల్ పేమెంట్ రంగంలో ఫోన్ పే, జీపే, పేటీఎమ్‌లకు ఇది కొత్త సవాలుగా మారనుంది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సవాలు విసురుతున్న జోహో సంస్థ ఇప్పుడు ఫిన్‌టెక్ రంగంలో అడుగుపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అరట్టై యాప్‌కు మరో బలాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో, జోహో తాజాగా పాయింట్ ఆఫ్ సేల్ (POS) డివైజ్‌లను లాంచ్ చేసింది.
జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు మాట్లాడుతూ, “వ్యాపారులు కస్టమర్ల నుంచి నేరుగా డిజిటల్ చెల్లింపులు స్వీకరించగలిగే విధంగా ఈ పీఓఎస్ డివైజ్‌లను రూపొందించాం. త్వరలో వీటిని అరట్టై యాప్‌తో అనుసంధానం చేయనున్నాం,” అని వెల్లడించారు.
డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇప్పటికే ఫోన్ పే, జీపే, పేటీఎమ్ వంటి దిగ్గజాలు ఉన్నా, దేశీ పరిష్కారాలను అందించడమే జోహో లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ సాఫ్ట్‌వేర్ ఎకోసిస్టమ్‌తో ఈ డివైజ్‌లను ఏకం చేయాలనే వ్యూహంతో సంస్థ ముందుకెళ్తోంది.
నిర్మాణ, రిటైల్, చిన్న వ్యాపార రంగాల్లో డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసే ఈ కొత్త పరికరాలు త్వరలో మార్కెట్‌లో అందుబాటులోకి రానున్నాయి.