- కొత్తపల్లి గ్రామంలో కాల్వ మరమ్మత్తులు లేక రైతులకు నీటి అందుబాటుపై ఇబ్బంది
- నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ మురికితో నిండిపోవడం వల్ల రైతులపై ప్రభావం
- కాలువల పరిస్థితిపై గ్రామ ప్రజలు, రైతుల ఆందోళన
నిజాంబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ మరమ్మత్తుల లేమి రైతుల ఆవేదనకు కారణమైంది. కాలువలు చెత్తతో నిండిపోవడం వల్ల నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదు. రైతులు, గ్రామ ప్రజలు సమస్యను అధికారులకు తెలియజేసినా స్పందన లభించలేదని తెలిపారు.
నిజాంబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూట్ కెనాల్ మరమ్మత్తుల లేమితో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాలువ చెత్తా చదరం, ముళ్ళపదలతో నిండిపోవడంతో నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలు శుభ్రం చేయకపోవడం వల్ల నీరు అందని ద్రాక్షగా మారిందని, రైతుల పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ ప్రజలు కాలువల్లో విష సర్పాలు చేరి ఇంట్లోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సమస్యను అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని, ఎన్నికల సమయంలో సమస్యలు విన్న నాయకులు తరువాత కనీసం చూడడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యపై చర్యలు తీసుకొని కాలువలను శుభ్రం చేయించాలని రైతులు, గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.