న్యూ ఢిల్లీ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 19
కరోనా సమయంలో భారీగా విరాళాలు సేకరించిన పీఎం కేర్స్ ఫండ్ నిధుల వినియోగంపై ఆడిట్ నివేదిక పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నిధిని ప్రజారోగ్యం, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉండగా, నిధులు భారీగా పేరుకుపోతున్నాయని, ఖర్చు మాత్రం నామమాత్రంగానే ఉందని ఆడిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.8,452.07 కోట్ల నిల్వలు ఉన్నాయని నివేదిక పేర్కొంది.
కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు సేకరించిన పీఎం కేర్స్ ఫండ్ నిధుల వినియోగంపై ఆడిట్ నివేదిక పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ నిధిని ప్రధానంగా చిన్నారులకు సహాయం, ప్రజారోగ్యం, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి ఖర్చు చేయాల్సి ఉండగా, నిధులు భారీగా పేరుకుపోతున్నాయని, ఖర్చు మాత్రం నామమాత్రంగానే ఉందని ఆడిట్ నివేదిక స్పష్టం చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ ఫండ్‌లో రూ.8,452.07 కోట్ల నిల్వలు ఉన్నాయని, ఇది అంతకు ముందు ఏడాది రూ.7,173.03 కోట్ల కంటే ఎక్కువని నివేదిక పేర్కొంది.
స్వల్ప ఖర్చు
అయితే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధి నుంచి కేవలం రూ.87.85 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రూ.15.60 కోట్ల ఖర్చుతో పోలిస్తే గణనీయంగా తగ్గింది. 2024-25లో రూ.87.84 లక్షలు చిల్డ్రన్ స్కీమ్‌కు కేటాయించగా, రూ.451 బ్యాంకు, ఎస్ఎంఎస్ ఛార్జీలకు ఖర్చు చేశారు. 2025 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖాతాలపై 2026 ఆగస్టు 6న ఫండ్ సంబంధిత అధికారులు, ఆగస్టు 7న చార్టర్డ్ అకౌంటెంట్ సంతకాలు చేశారు.
నిధుల కేటాయింపు
మొత్తం రూ.8,452.95 కోట్లలో రూ.7,846.65 కోట్లు షెడ్యూల్డ్ బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండగా, మరో రూ.604.41 కోట్లు బ్యాంకు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. దేశీయ విరాళాల రూపంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.479.05 కోట్లు అందగా, అంతకు ముందు ఏడాది ఇది రూ.681.81 కోట్లు అందింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1.14 కోట్లుగా ఉన్న విదేశీ విరాళాలు, 2024-25లో రూ.92.83 లక్షలు నమోదయ్యాయి.
వడ్డీ ఆదాయం
వడ్డీ మరో ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో రూ.469.38 కోట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.5.77 కోట్లు ఆర్జించింది. అమలు చేసే ఏజెన్సీల నుంచి రీఫండ్ల రూపంలో రూ.324.66 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీపై మినహాయించిన పన్ను రీఫండ్‌గా రూ.13.49 లక్షలు పొందింది.
పీఎం కేర్స్ ఫండ్ నేపథ్యం
కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ 2020 మార్చిలో ఏర్పాటు చేశారు. అదే ఏడాది మార్చి 27న న్యూ ఢిల్లీలో ట్రస్ట్ డీడ్ రిజిస్టర్ చేశారు. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవ నిర్మిత విపత్తులు, ఇతర క్లిష్ట పరిస్థితుల్లో సహాయం అందించడానికి ఈ నిధిని ఒక ప్రత్యేక యంత్రాంగంగా రూపొందించారు. దీని లక్ష్యాలు ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, ఔషధ సౌకర్యాలు, పరిశోధన, ప్రభావిత ప్రజలకు ప్రత్యక్ష ఆర్థిక సహాయం కోసం నిధులను కూడా అందించాలి.












