మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలి
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ఎమ్ 4 ప్రతినిధి ముధోల్
సమాజ ఉన్నతి కోసం తమ జీవితాన్ని ధారపోసిన మహనీయులను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన ముధోల్లో హిందు వాహిని ముక్తాపూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్ -సాహిత్య రత్న అన్నా భావు సాటే- స్వామి వివేకానంద విగ్రహాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వతంత్ర ఉద్యమంలో షహీద్ భగత్ సింగ్ తన ప్రాణాలను తృణపాయంగా అర్పించారని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు దేశం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తన సాహిత్యం ద్వారా సమాజాన్ని ప్రభావితం చేసిన అన్న బహు సాటే జీవితాన్ని విధిగా చదవాలన్నారు. భారత సంస్కృతి- సాంప్రదాయాలు -జీవన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా స్వామి వివేకానంద అమెరికాలోని చికాగోలో ఇచ్చిన ఉపన్యాసం నేటికీ అందరి మదిలో మెదులుతుందని పేర్కొన్నారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహానుభావులను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. యువత సైతం వారి జీవిత చరిత్రను విధిగా అధ్యయనం చేసి సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. హిందు వాహిని ముధోల్ శాఖ మహనీయుల విగ్రహాలను ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలు ప్రతిరోజు మనలో స్ఫూర్తిని పెంపొందించేందుకు దోహదపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో హిందు వాహిని ముక్తాపూర్ శాఖ సభ్యులు, ముధోల్ ఉత్సవ సమితి సభ్యులు, బీడీసీ సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.