*రోజుల్లో కోదండరామ్‌కు మళ్లీ ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన*
హైదరాబాద్, ఆగస్టు 25: ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో మళ్లీ ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా చేసిందని గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ నేతలు.. సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఆయన పదవిని తీయించేశారని విమర్శించారు. ప్రొ. కోదండరామ్ ఎమ్మెల్సీ పదవిని ఊడకొట్టేందుకు రూ. కోట్లు ఖర్చు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. అయినా.. ఎందుకు అంత శునకానందం మీకు అంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 1938 సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదిన గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన శివరాజ్ పాటిల్, పీవీ నర్సింహారావు ఈ యూనివర్సిటీ విద్యార్థులేనన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందిన జైపాల్ రెడ్డి సైతం ఈ యూనివర్సిటీ విద్యార్థినేని పేర్కొన్నారు. తెలంగాణ నలుమూలల్లో ఏ సమస్య వచ్చినా మొదట చర్చ జరిగేది యూనివర్సిటీలోనే తెలిపారు. చదువుతోపాటు పోరాటాన్ని సైతం నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ అని అభివర్ణించారు. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం చేతులెత్తేసినప్పుడు.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లింది ఈ యూనివర్సిటీనే అని వివరించారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారిది ఉస్మానియా యూనివర్సిటీనే అని తెలిపారు. అలాగే యాదయ్య, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు రాష్ట్ర సాధనలో భాగంగా సమిధలయ్యారని పేర్కొన్నారు. ఎంతో మంది మేధావులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదన్నారు. గత పదేళ్ల పాలనలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసే కుట్ర జరిగిందంటూ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని తాము ఆలోచన చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలను నియమించామని గుర్తు చేశారు. చదువుకుని చైతన్యం ఉన్న వారిని వీసీలుగా నియమించామని వివరించారు.
సోమవారం సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి విచ్చే శారు. ఈ సందర్భంగా ఆయన పలు భవనాలను ప్రారంభించారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం క్యాంపస్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
వారి ఎమ్మెల్సీలు రద్దు చేసిన సుప్రీంకోర్టు..
ఎమ్మెల్సీలు ప్రొ. కోదండరామ్,అమీర్ అలీఖాన్ సభ్యత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత.. వీరిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. అయితే వీరి నియామకాలపై బీఆర్ఎస్ నేత దాసోజ్ శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలుగా వీరిద్దరి నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో మరో 15 రోజుల్లో ప్రొ. కోదండరామ్‌ను ఎమ్మెల్సీని చేసి శాసన మండలికి పంపుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు..