పార్టీ కోసం పని చేసే వారికి పదవులు
ఐక్యంగా ఉండి విజయం సాధించాలి
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుల సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నిర్మల్ జిల్లా బైంసా బిజెపి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్న వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని, వివిధ విభాగాల్లో పదవులు ఇస్తామని, నాయకులు కార్యకర్తలు ఇలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. ఆదివారం బైంసా లోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో నూతనంగా ఎన్నికైన పట్టణ అధ్యక్షులు రావుల రాము, కుంటాల మండల అధ్యక్షులు పసుల నవీన్, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ఎ నపోతుల మల్లేష్, కట్ట రవిలను సన్మానించిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భైంసా మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అందరు కలిసి పని చేయాలన్నారు. పదవులు రాని వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు, జిల్లా పార్టీ పదవులు, నియోజకవర్గ పార్టీ పదవులు ఇస్తామని చెప్పారు. బిజెపి పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలన్నారు. పదవులు ఇవ్వడంలో బిజెపి అనుబంధం విభాగాలైన ఆర్ఎస్ఎస్, హిందు వాహిని, బజరంగ్ దళ్ లకు చెందిన ప్రముఖుల నుండి అభిప్రాయాన్ని సేకరించడం జరిగిందన్నారు. బిజెపి పార్టీ కుటుంబ పార్టీ కాదని, అందరికీ అవకాశాలు వస్తాయన్నారు. బైంసా హిందువులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి ధైర్యంగా నిలిచేది హిందు వాహిని కార్యకర్తలేనన్నారు. హిందు వాహిని నుండి వచ్చిన రావుల రాము నేతత్వంలో బిజెపి పార్టీ పట్టణంలో మరింత బలోపేతం అవ్వాలన్నారు. ఐక్యంగా ఉండి మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్నారు. ముధోల్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయ మన్నారు. సంవత్సరంన్నర కాలంలో 350 కోట్ల రూపాయలతో కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి జరిగిందన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, కుంటాల మాజీ ఎంపీపీ గజ్జారంతోపాటు నాయకులు చిన్న రెడ్డి వెంకట్రావు బబ్లు శీను లక్ష్మణ్ జిల్లా మండల నాయకులు పలువురు పాల్గొన్నారు.