శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
మనోరంజని తెలుగు టైమ్స్ – నిర్మల్ ప్రతినిధి, నవంబర్ 15
నిర్మల్ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో శనివారం అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక భక్తిరసంతో నిండిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరై స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు.
కళ్యాణోత్సవంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆమెడ శ్రీధర్ ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధనపాల్ మాట్లాడుతూ—
“ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్చారణల నడుమ సంప్రదాయ పూజారులు నిర్వహించే కన్యాదానం, మంగళసూత్రధారణ వంటి దైవిక కళ్యాణ ఘట్టాలు భక్తుల హృదయాలలో అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని నింపుతాయి. స్వామివారి కళ్యాణోత్సవాలు భక్తజనుల జీవితాలలో శాంతి, సమృద్ధి, సేవాభావం పెంచుతాయి” అని తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో నిర్వహించే కళ్యాణోత్సవాలలో పాల్గొనే భాగ్యభాగ్యం సిద్ధిస్తే అది స్వామివారి అనుగ్రహమేనని, భక్తితో చేసిన ప్రతి పాదసేవ భవభయాన్ని తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
వేడుకలో భక్తులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పెద్దఎత్తున హాజరై కళ్యాణోత్సవాన్ని ఘనవిజయవంతం చేశారు.