కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ నివేదికపై కేబినెట్‌లో చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరంపై కేబినెట్‌లో చర్చించి.. నిర్ణయం తీసుకుంటామని ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు వృథా అయ్యాయని ఆరోపించారు. మేడిగడ్డ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. కాళేశ్వరంపై తాను రాజకీయ విమర్శలు చేయడం లేదని చెప్పుకొచ్చారు. కాళేశ్వరం లేకుండానే.. దేశంలో రికార్డ్ పంటలు పండించామని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇవాళ(ఆదివారం) పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో మంత్రి ఉత్తమ్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడతామని అన్నారని.. ఈ ప్రాజెక్టును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. బనకచర్లను సీడబ్ల్యూసీ తిరస్కరించిందని గుర్తుచేశారు. బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాము చెప్పామని అన్నారు. పునర్వివిభజన చట్టానికి బనక చర్ల ప్రాజెక్టు వ్యతిరేకమని వెల్లడించారు. బనక చర్లను కట్టకుండా తాము అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.