భారీ వర్షంలో కొనసాగుతున్న మంత్రి సీతక్క పర్యటన

  • 22 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
  • వర్షాన్ని లెక్క చేయకుండా పర్యటన కొనసాగించిన మంత్రి సీతక్క.
  • అటవీ ప్రాంతాలలో కంటైనర్ పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు.

 ములుగు నియోజకవర్గంలో మంత్రి సీతక్క 22 కోట్ల రూపాయలతో రహదారుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భారీ వర్షం ఉన్నప్పటికీ, కార్యక్రమాలను వాయిదా లేకుండా కొనసాగించారు. పంట పొలాలకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేయడంతో పాటు, అటవీ ప్రాంతాల్లో కంటైనర్ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

 ములుగు నియోజకవర్గంలో భారీ వర్షం కురుస్తున్నా, మంత్రి సీతక్క అభివృద్ధి కార్యక్రమాలను వాయిదా వేయకుండా పర్యటనను కొనసాగించారు. ఈ సందర్భంగా, ఆమె 21 కోట్ల 56 లక్షల రూపాయలతో సి.ఆర్.ఆర్, ఎం.ఆర్.ఆర్ రహదారి మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. 15 రహదారులు పునర్నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఆమె వివరించారు.

మంత్రివర్యులు మాట్లాడుతూ, రైతులు పంట పొలాలకు సౌకర్యవంతంగా చేరడానికి రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం అందించడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోవడంతో, తాత్కాలికంగా కంటైనర్ పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ములుగు నియోజకవర్గం 75 శాతం అటవీ ప్రాంతాలతో నిండి ఉండడంతో అభివృద్ధి కార్యక్రమాలకు కొంత ఆటంకం కలుగుతోందని, దీని పరిష్కారానికి తానే స్వయంగా చొరవ తీసుకుంటానని మంత్రి సీతక్క చెప్పారు.

Leave a Comment