*ఉచితంగా లక్షల రూపాయల వైద్యం – కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా సేవలు*
సూపర్ స్పెషాలిటీ సేవలను ఉచితంగా అందిస్తోన్న ప్రభుత్వాసుపత్రులు – క్యాన్సర్‌కు రోబోటిక్ సర్జరీలు, డయాబెటిక్ రెటినోపతికి ఉచిత చికిత్స
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వాసుపత్రులు ఆధునిక పరికరాలతో, సూపర్ స్పెషాలిటీ సేవలతో మంచి వైద్యం అందిస్తామని భరోసా ఇస్తున్నాయి. దాదాపు ఉచితంగా అందే ఈ సేవలు. సామాన్యులకు వరంగా మారుతున్నాయి. ఎవరైనా, ఏ రాష్ట్రం వారైనా వీటిని వినియోగించుకోవచ్చు.
ఏపీలో పలు జిల్లాల్లో సైతం: గుంటూరులోని జీజీహెచ్‌లో ప్లాస్టిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, సీటీవీఎస్ వంటి 11 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ఒంగోలు జీజీహెచ్‌లో 7 విభాగాలలో వైద్యసేవలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నియోనాటాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, సర్జికల్, మెడికల్ ఆంకాలజీ విభాగాల్లో రోగులకు పైసా ఖర్చు లేకుండా మంచి వైద్య సేవలు అందుతున్నాయి.
కర్నూలు జీజీహెచ్‌లోని కార్డియో థొరాసిక్ విభాగంలో గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడలోని బోధనాసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీ వైద్య సేవలు ప్రతి సోమ, గురువారాల్లో అందిస్తారు. న్యూరో సర్జరీ విభాగంలో నెలకు 70 నుంచి 80 వరకు సర్జరీలు జరుగుతుంటాయి.
ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు అనుబంధంగా ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత రెండేళ్లుగా క్యాన్సర్, మూత్రపిండాల శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు ప్రభుత్వ బోధనాసుపత్రిలో ఆంకాలజీ సేవలు ప్రవేశపెట్టారు. విశాఖ, గుంటూరు, కర్నూలు, విజయవాడ, తిరుపతిలో మధుమేహానికి సమగ్ర వైద్య సదుపాయాలు ఉన్నాయి.
ఖర్చు లేకుండా డయాలసిస్ సేవలు: కిడ్నీలు విఫలమైతే డయాలసిస్ తప్పనిసరిగా చేయించుకోవాలి. వారానికి 3-5 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిందే. కొందరికి ప్రతి రోజూ అవసరమవుతుంది. ప్రైవేటులో ఒక్కో డయాలసిస్ సేవకు వేలల్లో వసూలు చేస్తారు. కానీ హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియాలో కిడ్నీ రోగులకు ఈ సేవలు పూర్తి ఉచితంగా అందిస్తుండటం గమనార్హం.
ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉన్నట్లయితే నిమ్స్‌లో సైతం డయాలసిస్ సేవలను ఉచితంగా చేస్తారు. విజయవాడలో బోధనాసుపత్రిలో కిడ్నీ, యూరాలజీ, వైద్య సేవలను సోమ, గురువారాలలో అందిస్తారు. కర్నూలులోని నెఫ్రాలజీ విభాగంలో ప్రతి నెలా 150 మందికి ఆధునిక వైద్యం ఉచితంగా అందుతోంది.