మహిళల్లో పేదరిక నిర్ములనకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం: మంత్రి సీతక్క
ప్రజ్వల స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నాంపల్లి లోని ఫ్యాప్సి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళల్లో ఉండే పేదరికం నిర్మూలించేందుకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను చేపట్టామని అన్నారు.మానవ అక్రమ రవాణాను నిరోధించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మానవ అక్రమ రవాణాను అడ్డుకుంటున్న ప్రజ్వల ఫౌండేషన్ చైర్మన్ సునీత కృష్ణన్ కు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
సునీత కృష్ణ న్ 32 వేల మంది అమ్మాయిలు మహిళలని వ్యభిచార కుపం నుంచి విముక్తి కల్పించారని.. ఆమె బాటలో అమ్మాయిలు మహిళల కోసం పనిచేస్తున్న ఆరుగురు ప్రముఖులను ఈరోజు సన్మానించుకున్నామని అన్నారు సీతక్క. మానవ అక్రమ రవాణా వెనుక పెద్ద ముఠా ఉంటుందని.. ఆ ముఠా గురించి మాట్లాడాలంటే సామాన్యులు భయపడతారని అన్నారు. అలాంటిది ప్రాణాలకు తెగించి మానవ అక్రమ ముఠా పై పోరాటం చేస్తున్న ప్రజ్వల అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు సీతక్క. మహిళల శరీరాలతో వ్యాపారం చేసి దుర్మార్గులు సమాజంలో ఉన్నారని.. వీళ్ళతో వ్యాపారం చేసి ఆస్తులు కూడ పెట్టే వారికి తల్లి అక్కా చెల్లెలు లేరా అని ప్రశ్నించారు.
ఇంట్లో మహిళలను పెట్టుకుని, ఇతర మహిళలతో వ్యాపారాలు చేయడం సిగ్గుచేటని.. మహిళా భద్రత కోసం మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు సీతక్క. వేల కోట్ల మేర బ్యాంకులో నుంచి రుణ సదుపాయం కల్పించామని.. వారి వడ్డీలను కూడా బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లకి 10 లక్షల ప్రమాద బీమా, రెండు లక్షల లోన్ బీమా అమలు చేస్తున్నామని.. మహిళా స్వయం సహాయక సంఘం అంటే కేవలం ఆర్థిక స్వావలంబనే కాదు.. అది మహిళల్లో సామాజిక భద్రతను, మానసిక ధైర్యాన్ని కలిగిస్తోందని అన్నారు సీతక్క.
మానవ అక్రమ రవాణాపై సమిష్టి పోరాటం చేయడం ద్వారా ఆ భూతాన్ని అంతం చేయవచ్చని.. అన్ని విద్యాసంస్థల్లో లైంగిక వేధింపులు, మానవ అక్రమ రవాణా పై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని.. శిక్షతోపాటు శిక్షణ ఇవ్వడం ద్వారా మహిళల పై నేరాలను అరికట్టవచ్చని అన్నారు సీతక్క…