నాయకులు మారిన.. ఝారి (బి) గ్రామస్తుల మారని తలరాతలు..?
– హామీ ఇచ్చి గద్దెనెక్కుతున్నారే తప్ప సమస్య తీర్చడం లేదు..!
– బ్రిడ్జ్ సమస్య పరిష్కరించని నాయకులపై మండిపడుతున్న గ్రామస్తులు
– జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో, ధర్నా చేపట్టిన వైనం
మనోరంజని ప్రతినిధి భైంసా జులై 27 -తానూర్:
ఎన్నికలు వచ్చాయంటే చాలు గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం ఓట్లు దండుకొని గద్దెనెక్కడం.. తీరా సమస్యలను గాలికి వదిలేయడం.. ప్రజా ప్రతినిధులకు ఉండే సహజ లక్షణం.. కానీ మహా నాయకుడు సమస్య పరిష్కరిస్తాడని గొప్పగా చెప్పుకునే ప్రజలు మాత్రం నాయకుల మాటలు నమ్మి నిండా మునుగుతున్నారే..? తప్ప వాళ్ల జీవితాలలో వెలుగులు రావడం లేదు. నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన నాయకులు ప్రస్తుతం ఆ సమస్యల పేరెత్తితేనే చిరాకు పడుతున్నారు. మీరేమైనా నాకు ఓట్లు వేశారని నమ్మకం ఉందా..? అంటూ ఓ ప్రజా ప్రతినిధి సమస్యలు విన్నవించడానికి వెళ్లిన వారికి ముఖం మీదే అన్నట్లు సమాచారం ఎన్నో సమస్యలు పరిష్కారం కాక గ్రామస్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నాయకులు మారిన తలరాతలు మారని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.. ఇందుకు నిదర్శనం తానూరు మండలంలోని ఝారి (బి) గ్రామం నిదర్శనంగా నిలుస్తోంది. ఎన్నో సంవత్సరాల నుండి గ్రామ సమీపంలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఇప్పటివరకు సమస్య పరిష్కరించిన నాధుడే లేడని మండిపడుతున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు బ్రిడ్జి నిర్మిస్తామని, గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి వెళ్తున్నారే తప్ప ఇప్పటివరకు సమస్య పరిష్కరించిన నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందని గ్రామస్తులు భయం గుప్పిట్లో జీవిస్తుంటారు. వర్షం కురిస్తే వాగు పై వరద ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోతాయి.. రాత్రిళ్ళు అక్కడివారు .. ఇక్కడివారు పడిగాపులు కాయల్సి వస్తుంది. తీరా వరద తగ్గాక ఇంటికి వెళ్తారు. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో వాగుపై వరద ఉప్పొంగి ప్రవహించింది కొందరు గ్రామానికి చెందిన వారు తప్పనిసరి పరిస్థితుల్లో వాగు దాటి వెళ్లారు. వాగు దాటే క్రమంలో ఏమాత్రం తడబడ్డ అంతే సంగతి..! కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇంటికి చేరుకున్నారు. ప్రతి ఇంట్లో రాత్రిళ్ళు వాగుపై చర్చ జరిగింది. వాగు సమస్య పరిష్కరించే నాధుడే కనిపించడం లేదని మదనపడ్డారు. కొందరు యువకులు ఏదైతే అది జరగని అని మొండి పట్టుదలతో ఆదివారం బెల్ తరోడ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు…మా గ్రామానికి బ్రిడ్జ్ నిర్మిస్తేనే రోడ్డుపై నుండి లేస్తామని భీష్మించి కూర్చున్నారు. దీంతో రోడ్డు ఇరువైపులా కిలోమీటర్ మేరా వాహనాలు నిలిచిపోయాయి బ్రిడ్జి నిర్మిస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని పట్టుదలతో గ్రామస్తులు కనిపించారు. ప్రజా ప్రతినిధులపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రాణాలు పోతే కానీ స్పందించరా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రాణాలపై లెక్క చేయని ప్రజాప్రతినిధులు ఎలక్షన్లలో మా గ్రామానికి వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తామని అంటున్నారు. ఓట్లు దండుకొని గద్దెనెక్కి కూర్చుంటే సరిపోతుందా..? ప్రజల సమస్యలను పట్టించుకోరా..? అని మండిపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఎక్కడికైనా వెళ్తామని.. అన్నారు. నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని, ప్రజా ప్రతినిధుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏ ఒక్క ప్రజా ప్రతినిధి పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఉదయం లేచిన నుండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడమే తప్ప ఎవరు చేసింది ఏమీ లేదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా ప్రతినిధుల ఆగడాలు ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎలక్షన్లో వాళ్ల సత్తా వాళ్లు చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.