- ఆప్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం.
- శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్ కూటమి కోసం కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హేమంత్ సోరెన్ తరపున కేజ్రీవాల్ ప్రచారం.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేయకూడదని నిర్ణయించింది. శివసేన (యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి కూటమి తరపున ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం తరపున కూడా ఆయన ప్రచారం చేయనున్నారు. మహారాష్ట్రలో పోలింగ్ నవంబర్ 20న జరగనుంది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Polls) పోటీ చేయకూడదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయం తీసుకుంది. శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ, కాంగ్రెస్‌తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి తరపున ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. “మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంవీఏ అభ్యర్థుల తరపున కేజ్రీవాల్ ప్రచారం చేస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయదు,” అని ఆయన ట్వీట్ చేశారు.
మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి తమ పార్టీని సంప్రదించినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం తరపున కూడా కేజ్రీవాల్ ప్రచారం చేయనున్నారు.
మరోవైపు మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.