– తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కమల్ హాసన్‌ను కలవడం హాట్ టాపిక్
– 2025 లో రాజ్యసభకు కమల్ ఎంపికపై ఊహాగానాలు
తమిళ సినీ నటుడు, మక్కల్ నీది మయం పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం. డీఎంకే 2025లో రాజ్యసభ సీటు ఇస్తామని వాగ్దానం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు బుధవారం కమల్ ఇంటికి వెళ్లి, సీఎం ఎంకే స్టాలిన్ హామీ అందజేసినట్లు సమాచారం. జూలైలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో కమల్ ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
తమిళ సూపర్ స్టార్, నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. డీఎంకే ప్రభుత్వం కమల్‌ను పెద్దల సభకు నామినేట్ చేయనున్నట్లు సమాచారం. జూలైలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఆయన ఎంపికపై మూడు రోజులుగా ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ఈ ప్రచారం తెరపైకి రావడానికి ముఖ్యమైన కారణం తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు బుధవారం కమల్ ఇంటికి వెళ్లి ఆయనతో ప్రత్యేక భేటీ కావడం. ఈ సమావేశంలో “మీ రాజ్యసభ సీటు కన్ఫర్మ్” అంటూ కమల్‌కు హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
గతేడాది మక్కల్ నీది మయ్యమ్ పార్టీ, లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేసింది. పొత్తులో భాగంగా 2025లో ఒక రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఆ హామీ నెరవేరబోతోందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
కమల్ హాసన్ గతంలో “దేశం కోసమే మద్దతిచ్చాం, నేను ఏ పదవి ఆశించలేదు” అని చెప్పినప్పటికీ, తాజా పరిణామాలు చూస్తే అయితే, ఆయన త్వరలో రాజకీయ రంగంలో మరింత శక్తివంతమైన పాత్ర పోషించబోతున్నట్లు స్పష్టమవుతోంది.