- నైపుణ్యంతో కూడిన విద్యను ప్రాధాన్యతగా ఉంచాలి
- కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో పెట్టుబడులు పెట్టాలని సూచన
- డిల్లీ పబ్లిక్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యతో పాటు నైపుణ్యం కలిగిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడగలరని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యలో పెట్టుబడులు పెట్టాలనీ, నాణ్యమైన విద్య అందించడం ద్వారా విద్యారంగంలోని అసమానతలు తొలగించవచ్చని సూచించారు.
స్టేషన్ ఘనపూర్:
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలో డిల్లీ పబ్లిక్ స్కూల్ 11వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు విద్యారంగంలోని ప్రాధాన్యతను ఉద్ఘాటించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి విద్యార్థికి చదువుతో పాటు నైపుణ్యం కూడా కలగాలి. ఇలాంటి విలువలతో కూడిన విద్యను అందించడం వల్లనే వారు ఏ రంగంలోనైనా రాణించగలరు” అని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెరుగైన విద్య అందించేందుకు 10 ఏళ్ల క్రితం డిల్లీ పబ్లిక్ స్కూల్‌ను స్థాపించామన్నారు. నేడు భారతీయులు ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఇది వారి నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు.
అయితే, స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా విద్యా మరియు వైద్య రంగాలలో ఆశించిన అభివృద్ధి సాధించలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడం వల్ల విద్యారంగంలో అసమానతలు ఏర్పడ్డాయని, ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులు కార్పొరేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడలేకపోతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి, డిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాజీ రెడ్డి, వైస్ చైర్మన్ రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.