*గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో విడుదల.. 50శాతం మించొద్దు..*
తెలంగాణ వ్యాప్తంగా 12వేల 733 గ్రామ పంచాయతీలున్నాయి. ఈ పంచాయతీల్లో ఒక లక్షా 12 వేల 288 వార్డులున్నాయి. తెలంగాణలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా షెడ్యూలు ఖరారుపై అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పంచాయతి ఎన్నికలకు సంబంధించి 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా సిఫారసు చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కేటాయించాలని చూస్తున్నారు. 2018 పంచాయతీరాజ్ చట్టం సవరణ కారణంగా గత పంచాయతీ ఎన్నికల్లో కల్పించిన రిజర్వేషన్లు రొటేషన్ పద్దతిలో మారనున్నాయి. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది.
దీంతో గత ఎన్నికల్లోని రిజర్వేషన్లు మారే అవకాశం ఉంది. దీనివల్ల ఒకే వర్గానికి వరుసగా రిజర్వేషన్ ఉండకుండా మారే అవకాశమంది. జనరల్ ఉన్న చోట బీసీలకు, మహిళలు ఉన్న చోట జనరల్, జనరల్ ఉన్న చోట మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశముంది. దీంతో గ్రామ పంచాయతీల్లో ఇపుడు అమల్లో ఉన్న రిజర్వేషన్లలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయని తెలుస్తోంది.
*పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో సంబంధంలేకున్నప్పటికీ..*
ఆయా రాజకీయ పార్టీ నాయకులు తమ మద్ధతు దార్లను బరిలోకి దింపేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. మండల స్థాయి రాజకీయ పార్టీ నాయకులు, గ్రామాల్లో మద్ధతుదారుల స్థితిగతులు, రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని బలమైన ప్రతినిధులను బరిలో దింపే ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, ఆయా పార్టీ ప్రతినిధులుగా పోటీ చేయించే ప్రయత్నాల్లోఉన్నారు.
ఇపుడు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు మద్ధతుదారులుగా ఉంటే.. మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉంటుందనే భావన వ్యక్తమవుతోంది. దీంతో మండల స్థాయి రాజకీయ నాయకుల ఇళ్లవద్ద సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారితో సందడిగా మారాయి.