బాసర ట్రిపుల్ ఐటి లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు
మనోరంజని ప్రతినిధి
బాసర : జనవరి 23
బాసర ఆర్జికెటియు లో మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ బాసర ఆర్జికెటియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వర్సిటీలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్జికెటియులో జరుగుతున్న అన్ని అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, వర్సిటీ అభివృద్ధి, మరమ్మత్తుల పనులన్నీ పూర్తి చేయాలని తెలిపారు
. వర్సిటీ ప్రాంగణంలో నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలను కొనసాగించి పరిశుభ్రతను పాటించాలన్నారు. వర్సిటీలో విద్యను అభ్యసించే విద్యార్థులందరికీ నాణ్యమైన రుచికరమైన, ఆహారాన్ని అందించాలన్నారు. విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేసి భోజన మెనూలో వారి సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు అందిస్తున్న భోజన మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్సిటీలో చేపట్టిన కార్యక్రమాల వివరాల నివేదికలను ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు.
ఇప్పుడు ఉన్న డిజిటల్ లైబ్రరీలకు అనుగుణంగా మరికొన్ని డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రంథాలయంలో సీటింగ్ సామర్థ్యాన్ని పెంచి, పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేవారికి సౌకర్యంగా పోటీ పరీక్షల ప్రత్యేక పుస్తకాలు సరిపడినన్ని సమకూర్చుకోవాలన్నారు.
వర్సిటీ ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్ ల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలాన్నారు. దశల వారీగా విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ, సోలార్ విద్యుత్ వైపుకు మళ్లాలన్నారు. వర్సిటీ విద్యార్థులచే ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు మోటివేషన్ తరగతులను నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో బాసర ఆర్జికెటియు కార్యాలయ పర్యవేక్షకులు ప్రొఫెసర్ రణధీర్, బైంసా ఆర్డిఓ కోమల్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు