ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్ల కేటాయింపుపై హైకోర్టులో విచారణ
రాజ్యాంగ విరుద్ధమని ఆదివాసీ సేన వాదనలు
హైదరాబాద్, జూలై 29 (M4News): ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుపై తక్షణ విచారణ జరపాలని కోరుతూ ఆదివాసీ సేన తరఫున హైకోర్టులో రిట్ పిటిషన్ (నెం.22007/2025) దాఖలైంది. ఈ పిటిషన్‌పై నేడు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేష్ విచారణ చేపట్టారు.
ఆదివాసీ సేన తరపున న్యాయవాదులు సి. హెచ్. రవికుమార్ మరియు సోడే వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ అధికారులు ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి జారీ చేసిన జీవోలు, మెమోలు లొపాలు వివరించారు. ముఖ్యంగా ఎల్‌టీఆర్ (LTR) మరియు పీసా (PESA) నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులకు ఇండ్ల కేటాయింపు జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు ఇళ్లు కేటాయించడం రాజ్యాంగ బద్ధంగా నిషేధితమైన అంశం. ఇది ఆదివాసీ హక్కుల్ని తుడిచిపెట్టే చర్య. వెంటనే ఈ కేటాయింపులు రద్దు చేయాలి,” అని గట్టిగా వాదించారు.
వాదనలు విన్న గౌరవ ధర్మాసనం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, సంబంధిత అధికారులను తగిన సమాచారం, అభ్యంతరాలతో హాజరవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.