భద్రాచలం, 25-07-2026
పాల్వంచ మండలం దంతులబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ శ్రీ సిడెం వెంకటరమణ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భద్రాచలం పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాల్వంచ మండలం దంతులబోరు గ్రామానికి చెందిన గిరిజన సర్పంచ్ శ్రీ సిడెం వెంకటరమణ వైద్యం వికటించి మృతి చెందిన విషయం తెలుసుకుని, గౌరవ భద్రాచలం మాజీ శాసనసభ్యులు శ్రీ పొదెం వీరయ్య గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమాయక గిరిజన ప్రజాప్రతినిధికి ఇలాంటి విషాదకర పరిస్థితి ఎదురుకావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొంటూ, మృతురాలి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వైద్యంలో ఏవైనా నిర్లక్ష్యం, అలసత్వం లేదా సకాలంలో చికిత్స అందించడంలో లోపాలు జరిగినట్లు తేలితే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిపారు.
గిరిజన ప్రాంతాలకు చెందిన అమాయక ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులకు వచ్చినప్పుడు వారికి మానవత్వంతో, బాధ్యతాయుతంగా, తక్షణమే వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది మరియు ఆసుపత్రి యాజమాన్యాలు వ్యవహరించాలని శ్రీ పొదెం వీరయ్య గారు సూచించారు.
అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగుల ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి వైద్య సంస్థపై ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.











