నిర్మల్ జిల్లాలో డాక్టర్ సంతోష్ రాజ్‌పై జరిగిన దాడిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను అమానుషమని అభివర్ణిస్తూ, వైద్యుల భద్రతకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఎస్వీఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంతోష్ రాజ్ దంపతులను పరామర్శించి, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి గల కారణాలను డాక్టర్ సంతోష్ రాజ్ వివరించారు.
ఘటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, సమాజంలో వైద్యులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
వైద్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న సేవలను గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పాకాల రామచందర్, ఎ. మేడ శ్రీధర్, రాజు రావు, మేడారం ప్రదీప్, డా. కిరణ్, వినయ్, జొన్న మహేష్ తదితరులు పాల్గొన్నారు.











