క్షయ వ్యాధికి సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందని, దీంతో భయపడాల్సిన అవసరం లేదని ఆర్.ఎం.పి పి.ఎం.పి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అమ్ముల సాగర్ తెలిపారు. ప్రారంభ దశలో గుర్తిస్తే, ఆరు నుంచి తొమ్మిది నెలల్లో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం (మార్చి 25) సందర్భంగా, సాగర్ ఈ వ్యాధిపై అవగాహన కల్పించారు. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందని, దగ్గు, తుమ్ముల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యాధిని కఫా పరీక్ష, ఎక్స్రే, సీబీ నాట్ వంటి పరీక్షల ద్వారా గుర్తించవచ్చని, నిర్ధారణ తర్వాత సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యమని సాగర్ వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ వ్యాధికి సంబంధించిన పరీక్షలు, మందులు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
చికిత్సను మధ్యలో ఆపకుండా, నిర్దేశించిన కాలవ్యవధి వరకు కొనసాగించాలని, అప్పుడే వ్యాధి పూర్తిగా నయమవుతుందని ఆయన స్పష్టం చేశారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన కోరారు.








