భైంసా, జూలై 3
భైంసా ఏరియా ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌తో పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో నిరుపేద కుటుంబాలు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో, వేలల్లో ఖర్చుతో కూడిన వైద్యానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తప్పింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సేవలు అందుబాటులోకి రావడంతో ప్రాణాలను నిలబెట్టుకునే అవకాశం కలిగింది.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే భైంసా ఏరియా ఆస్పత్రిలో రెండేళ్ల క్రితం డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఖరీదైన వైద్యం అందుబాటులోకి రావడంతో పేదలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బైంసా ప్రాంతంలో అధిక శాతం వ్యవసాయాధారిత ప్రాంతం కావడంతో ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. వేలకు వేలు ఖర్చు చేసి కొందరు వైద్యానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. అలాంటిది ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభించడంతో ప్రాణాలను నిలబెట్టుకునేందుకు అవకాశం కలిగినట్లయింది.
గతంలో ఇలాంటి సమస్యతో బాధపడేవారు నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈ కేంద్రాలకు అక్కడి ప్రాంత బాధితులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది బాధితులు రావడంతో తమ వంతు కోసం రోజుల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. దీంతో వారు పడే పాట్లు వర్ణనాతీతం. రెండు రోజుల ముందుగానే వెళ్లి తెలిసిన వారి వద్ద లేదా ఆస్పత్రి పరిసరాల్లోనే నిరీక్షించాల్సి రావడం చికిత్స అనంతరం తిరిగి ఇంటికి రావడం జరిగేది. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు బైంసాలో ఏర్పాటు చేసిన కేంద్రంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది పేదలకు ఎంతో మేలు కలిగిస్తోంది. బైంసా, ముథోల్, తానూర్, కుభీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది.
బైంసాలోని ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రంలో మొత్తం ఐదు యంత్రాలు ఉన్నాయి. మూడు షిఫ్టులలో బాధితులకు రక్త శుద్ధి నిర్వహిస్తుంటారు. రోజుకు 15 మంది చొప్పున ఇక్కడి కేంద్రంలో సేవలు పొందుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మూడు షిపుల పద్ధతిన రోగులు రక్తశుద్ధిని చేస్తు న్నారు. మొత్తంగా 32 మంది బాధితులు రక్త శుద్ధి నిర్వహించుకుంటుండగా ఇందులో కొంత మంది వారానికి రెండు సార్లు చేయించుకునే వారు ఉండగా మరికొంత మంది వారానికి మూడు సార్లు కేంద్ర సేవలు వినియోగించుకుంటున్నారు.
రెండు సంవత్సరాలుగా వారానికి రెండు పర్యాయాలు రక్తశుద్ధి నిర్వహించుకుంటున్నారు. కేంద్ర నిర్వహణ సిబ్బంది ద్వారా అనిర్వచనీయమైన సేవలు అందుతున్నాయి. డయాలసీస్ బాధితులకు ఇక్కడి కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా మారింది.
- జితేందర్, కస్రా, కుభీర్ మండలం
ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రంలో మరిన్నీ రక్త శుద్ధి యంత్రాలతో పాటు సిబ్బంది పెంపు కోసం ప్రభుత్వానికి నివేదించాం. కేంద్ర నిర్వహణ వ్యవస్థ పూర్తిస్థాయి మెరుగైన రీతిలో కొనసాగుతోంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ బాధితులకు సేవలు అందిస్తున్నారు. రక్తశుద్ధి నిర్వహించుకునేందుకు వచ్చే బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు, వసతులు కల్పించాం.











