భద్రాచలం, 2026-06-05
మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని పేద రోగులకు ఆశాకిరణమైన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పాయకానాల (బాత్రూంల) దుస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డెలివరీ వార్డు, ఎమర్జెన్సీ, ఐసీయూ విభాగాల్లోని బాత్రూంలకు డోర్లు, గొల్లాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు రాష్ట్రాల సరిహద్దుల్లోని పేద రోగులకు పెద్ద దిక్కుగా ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పాయకానాల (బాత్రూంల) దుస్థితి వర్ణనాతీతంగా మారింది. ప్రభుత్వం పేదల కోసం సదుద్దేశ్యంతో 200 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినప్పటికీ, ఇక్కడి సౌకర్యాల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం నెలకొంది. ప్రతిరోజూ వందలాది మంది రోగులు ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. గతంలో కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులు సైతం తమ భార్యలకు, పిల్లలకు ఇదే ఆసుపత్రిలో ప్రసవాలు చేయించిన చరిత్ర ఉన్నప్పటికీ, నేడు పేదల ఆశాకిరణమైన ఈ ఆసుపత్రి పరిస్థితే ఇలా ఉంటే ఎలా అని ప్రజలు వాపోతున్నారు.
సౌకర్యాల లేమి
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, ముఖ్యంగా డెలివరీ వార్డు, ఎమర్జెన్సీ బ్లాక్, ఐసీయూ విభాగాల్లోని బాత్రూంలకు సరైన డోర్లు లేవు. ఒకవేళ ఉన్నా వాటికి గొల్లాలు లేకపోవడంతో స్త్రీ, పురుషులు ఎవరూ ఇబ్బంది పడకుండా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అన్ని టాయిలెట్లది ఇదే దుస్థితి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యం వీడడం లేదని రోగులు వాపోతున్నారు. అసలే పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్న ఆసుపత్రికి, ఇలాంటి బాత్రూంల పరిస్థితి చూసిన పేద రోగులు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదని స్పష్టంగా అర్థమవుతోంది.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
అదే బాత్రూంలలోకి పెద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ కుటుంబ సభ్యులను పంపించగలరా ఒక్కసారి ఆ పని చేసి చూడండి. పేదలంటే ఇంత అలుసా ఇది ఎంత దుర్మార్గం అని రోగులు ప్రశ్నిస్తున్నారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఆ బాత్రూంలలోకి వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు. పర్యవేక్షణ చేయాల్సిన అధికారుల, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది.
శాసనసభ్యుడిపై చర్చ
భద్రాచలం శాసనసభ్యుడే స్వయంగా వైద్యుడైనప్పటికీ, ఆసుపత్రిలో మెరుగైన సేవలు ఎందుకు అందడం లేదనే దానిపై కొంత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, ఇతర ఉన్నతాధికారులు స్పందించి, బాత్రూంలు, ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉండేలా తగు ఆదేశాలు జారీ చేయాలని రోగులు కోరుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.











