..భైంసాలో గ్రీవెన్స్ డే – ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్
బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి అక్టోబర్ 15
నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్ బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 9 మంది ఫిర్యాదు దారుల సమస్యలను స్వీకరించి, ప్రతి ఒక్క ఫిర్యాదుపై తక్షణ స్పందననిచ్చారు.
ఫిర్యాదు దారుల సమక్షంలోనే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, బాధితులకు చట్టపరమైన సహాయం తక్షణమే అందించాలని స్పష్టం చేశారు. సమస్యలు ఆలస్యం కాకుండా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.
కుటుంబ వివాదాల పరిష్కారంలో ‘షీ టీం’ కీలక పాత్ర:
ఈ గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వచ్చిన కొన్ని కుటుంబ సమస్యలపై ‘షీ టీం’ సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
కౌన్సిలింగ్ ఫలితంగా కొన్ని కుటుంబాలు మళ్లీ కలుసుకోవడంతో బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.
“నిర్మల్ వరకు రావడం సాధ్యపడకపోతే, భైంసాలోనే కౌన్సిలింగ్ కల్పించడం ఎంతో ఉపయోగకరమైందని” వారు అభిప్రాయపడ్డారు.
ఈ సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు హర్షించారు.
పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష:
ఈ సందర్భంగా గతంలో గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పురోగతిని ఎస్పీ గారు సమీక్షించారు.
పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, సంబంధిత అధికారులకు నిర్దేశించారు.