తాత అడుగుల్లో మనవడు — ఆపదలో ఆపద్బాంధవుడిగా సేవకుడు
ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్న అవార్డు గ్రహీత తాడేవార్ కరుణాకర్
మనోరంజని, తెలుగు టైమ్స్, భైంసా ప్రతినిధి సూర్యవంశీ మాధవరావు పటేల్:
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన తాడేవార్ కుటుంబం, తరతరాలుగా ప్రజాసేవకులుగా పేరొందింది. దివంగత తాడేవార్ హన్మండ్లు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచి, తన సొంత భూమిని కళాశాలకు విరాళంగా ఇచ్చి సమాజంలో సేవా పథాన్ని ప్రతిష్టించారు. అతని అడుగుజాడల్లో ముందుకు సాగుతున్న మనవడు తాడేవార్ కరుణాకర్, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పనిచేయడం ద్వారా ప్రజలకు సేవ అందిస్తూ, ఆపద సమయంలో “నేను మీకు తోడుగా ఉన్నాను” అనే భరోసాను ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలు పొందుతున్నారు. కోవిడ్ లో ఆసుపత్రిలో రోగులకు తన సొంత సొమ్ముతో ఆహారం పొట్లాలు అందజేశారు. కరోనా మహమ్మారి సమయంలో, నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో కోవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తి నాగేష్కు స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం కరుణాకర్ సేవా ధర్మానికి నిదర్శనం. తన సేవా యాత్రను ఆపకుండా కొనసాగిస్తున్న కరుణాకర్ తెలిపారు — “నా తాత తాడేవార్ హన్మండ్లు పేరు మీద మరిన్ని సేవా కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తాను. సమాజానికి చేయూత ఇవ్వడం నా జీవిత కర్తవ్యం” అని. తాడేవార్ కుటుంబంలో ప్రతి కొత్త తరం, మరింత ప్రజాసేవకు కట్టుబడతుందని, కరుణాకర్ జీవన విధానం చెబుతోంది.