స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు..సర్పంచ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రభుత్వం మొగ్గు..!!
మనోరంజని ప్రతినిది
ఎవరైనా కోర్టుకు వెళ్తే ఏం చేయాలనే దానిపై స్టడీ
ఈ నెలాఖరులోనే డెడికేటెడ్ కమిషన్ నివేదిక
అసెంబ్లీ సమావేశం నిర్వహించి తీర్మానం చేసే యోచన
ఫిబ్రవరిలోనే ఎన్నికల నిర్వహణకు కసరత్తు
మనోరంజని ప్రతినిది
హైదరాబాద్ : జనవరి 21
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర సర్కార్ కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని యోచిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఈ నెలఖారులోగా రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం, కులగణన సర్వే లెక్కల్లో వచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రంలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. ఈ వివరాలు ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్కు అందాయి.
కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత రిజర్వేషన్ల పెంపు, సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేయనున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకార రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే కోర్టుల్లో ఇబ్బంది రాకుండా బీసీల రిజర్వేషన్లు ఎలా పెంచాలానే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నది. ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాది కావొస్తోంది. ఇంకా ఎక్కువ రోజులు ప్రత్యేక అధికారుల పాలన పెట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఫిబ్రవరి నెలలోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నది.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం చేయాల్సి ఉన్నది. ఆ స్థాయిలో చేస్తే మొత్తం రిజర్వేషన్లు 68 శాతానికి చేరుతాయి. అంత కాకపోయినా 33 శాతం పెంచినా 50 శాతం లిమిట్ దాటుతుంది.
రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు ఎక్కడా కోత పెట్టేందుకు అవకాశం ఉండదు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50 శాతం దాటొద్దు. కాకపోతే హైకోర్టు ఉత్తర్వులతోనే డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేసి.. శాస్ర్తీయ పద్ధతిలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నందున కోర్టులు అడ్డుకోవనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
ఒకవేళ కోర్టుల నుంచి స్టే వస్తే సమస్య మళ్లీ మొదటి వస్తుంది. ఎన్నికల నిర్వహణ ముందుకు సాగదు. దీంతో మళ్లీ ఏప్రిల్లోనే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై డెడికేటేడ్ కమిషన్ ఇచ్చే నివేదికను అసెంబ్లీలో చర్చించి.
. తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆలోచన చేస్తున్నది. మరోవైపు ప్రభుత్వం తరఫున ఇవ్వలేకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించి సర్పంచ్ ఎన్నికలకు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తుంది.
కుదిరితే 15-20 రోజుల్లోనే ఎన్నికలు పూర్తి
ఒకవేళ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే వారం, పది రోజుల్లోనే కసరత్తును పూర్తి చేసి 20 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని అనుకుంటున్నది. మార్చి 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఆ తరువాత పదో తరగతి పరీక్షలు ఉండనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు ఇబ్బంది అవుతుంది. ఫలితంగా ఏప్రిల్లో ఎన్నికలు పెట్టుకోవాల్సి ఉంటుంది