బాధ్యతాయుత ప్రతిపక్షంగా మంచి నిర్ణయం..!
రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్
అధ్యయన కమిటీలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేరికపై హర్షం
రైతులను, వ్యవసాయ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేలా ప్రధాన ప్రతిపక్షంగా తమ వంతు పాత్ర పోషించాలనే సదుద్దేశంతోనే రైతు సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అధ్యయన కమిటీని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలంగాణ సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్ హర్షం ప్రకటించారు.
మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొంటూ.. అధ్యయన కమిటీ కన్వీనర్ గా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తోపాటు అనుభవజ్ఞులైన షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడిగా అదే విధంగా నేటికీ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే అంజయ్య ద్వారా కమిటీకి ఎంతో లాభం చేకూరుతుందని అన్నారు.
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే 400 మందికి పైగా రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఆందోళనకర పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నదని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన రైతు రుణమాఫీ కనీసం 30 శాతాన్ని దాటకపోవడం, రైతన్నలకు కొన్ని సంవత్సరాలుగా అందుతున్న రైతుబంధును ఆపి, ఇస్తామన్న రూ.15 వేల రైతు భరోసాను కూడా ఎగ్గొట్టడం వంటి ప్రధానమైన ఆర్థిక సమస్యలు రైతు ఆత్మహత్యలకు దారితీస్తున్న విషయం తమ పార్టీ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు సరఫరా, సకాలంలో సాగునీటి వసతి కల్పించే విషయంలో సరారు పూర్తిగా చేతులెత్తేయడంతోనే రైతులు తీవ్ర సంక్షోభంలో కురుకుపోతున్నాని ఆవేదన చెందారు. కాంగ్రెస్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్లే రాష్ట్ర వ్యవసాయ రంగం పూర్తిగా చిన్నాభిన్నమైందని విమర్శించారు