గణపతి నవరాత్రులను సామరస్యంతో జరుపుకోవాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.*

*గణపతి నవరాత్రులను సామరస్యంతో జరుపుకోవాలి.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.*

*మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి. ఆగస్టు 26.*

ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పురస్కరించుకొని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ప్రజలంతా సామరస్యంతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో డి.సి.పి. ఎ. భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్, పంచాయితీ, పోలీస్, విద్యుత్ ఇతర సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. వినాయక మండపాల ఏర్పాటు కొరకు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని, అనుమతి పొందిన గణపతి మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో మండపాలను నిర్మించవద్దని, రక్షణతో కూడిన వైరింగ్ వ్యవస్థను వినియోగించాలని, షార్ట్ సర్క్యూట్ లను నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇన్వర్టర్లు, జనరేటర్లను ఉపయోగిస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలని, విద్యుత్ సిబ్బందితో వైరింగ్ తనిఖీ చేయించుకోవాలని, ఇందు కొరకు టోల్ ఫ్రీ నం.1912లో సంప్రదించాలని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి మండపం ఎత్తు, వెడల్పు, ఏర్పాటు చేసిన ప్రదేశం వివరాలను సమర్పించినట్లయితే నిమజ్జనం రోజున రూట్ మ్యాప్ రూపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. అగ్ని ప్రమాదాలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, నిమజ్జనం రోజున ఆబ్కారీ మధ్య నిషేధ శాఖ ఆధ్వర్యంలో డ్రై డే నిర్వహించాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది, అంబులెన్స్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను చెరువులు, గోదావరి నది, ఇతర నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని, మున్సిపల్, పంచాయితీ శాఖల ఆధ్వర్యంలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద సింగరేణి ఆధ్వర్యంలో నిమజ్జనానికి అవసరమైన లైట్లు, క్రేన్లు ఇతర ఏర్పాట చేయాలని తెలిపారు.

డి.సి.పి. మాట్లాడుతూ గత సంవత్సరం 2 వేల 400 విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు జారీ చేయడం జరిగిందని, ఈసారి మండపాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎలాంటి గొడవలు, ప్రాణ నష్టం జరగకుండా నిఘా నిర్వహిస్తామని, మండపాల ఏర్పాటుకు పోలీసు శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. మండపాలలో రాత్రిపూట నిర్వాహకులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని, భారీ విగ్రహాల వద్ద సి. సి. కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment