నూతన రేషన్ కార్డులతో పేద ప్రజలకు ఆహార భద్రత
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
*తానూరు మనోరంజిని ప్రతినిధి జూలై 31*
ప్రభుత్వం అందజేస్తున్న నూతన రేషన్ రేషన్ కార్డుల వల్ల పేద ప్రజలందరికీ ఆహార భద్రత కలుగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం తానూర్ మండల కేంద్రంలోని రైతువేదికలో ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలకు మేలు కలుగుతుందని తెలిపారు. తానూర్ మండలానికి గాను 1853 నూతన రేషన్ కార్డులు మంజూరు కాగా, 2575 రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు అదనంగా చేర్చడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు. ప్రజలు ఎప్పుడైనా నూతన రేషన్ కార్డుల కొరకు గానీ, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చుటకు గాను దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. రేషన్ కార్డులు పొందిన వారు క్రమం తప్పకుండా తమ కోటా బియ్యాన్ని పొందాలన్నారు. ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుందని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని తెలిపారు. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ నూతన రేషన్ కార్డుల పంపిణీ సంతోషకరమైన విషయం అని అన్నారు. పేదలకు ప్రతి నెలా బియ్యం అందిస్తున్నందుకు గానూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన రేషన్ కార్డుల పంపిణీతో ప్రజలకు ఇబ్బందులు తీరుతాయని అన్నారు. ఈ నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, తహసిల్దార్ మహేందర్, ఇతర అధికారులు, రేషన్ కార్డుల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.