సోయా కొనుగోలు కేంద్రాల కోసం రైతుల పాదయాత్ర
అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయండి
ముధోల్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 13
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి ప్రభుత్వపరంగా సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ పాదయాత్ర చేపడుతున్నట్లు భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొంది రైతులు పాదయాత్రగా ముధోల్ లోని పశుపతినాథ్ ఆలయంకు చేరుకుంటారన్నారు. తర్వాతి రోజు ఉదయం ఏడు గంటలకు ముధోల్ లోని పశుపతినాథ్ ఆలయం నుండి నడుచుకుంటూ బైంసా పట్టణంలోని అడిషనల్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందిస్తారని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంతోపాటు ప్రభుత్వపరంగా సోయా కొనుగోలు ఏర్పాటు చేసి మద్దతు ధరను కల్పించాలని కోరారు. ఇప్పటికే దిగుబడి రాక పండించిన పంటకు దళారులు తమ ఇష్టానుసారంగా రైతుల అవసరాలను అవకాశంగా తీసుకుని తక్కువ ధరను చెల్లించడం నష్టాన్ని కలిగిస్తుంది అన్నారు. పంట నష్టపరిహారం అందక పండించిన పంటకు ధర లేక రైతులు పడుతున్న అవస్థలు వర్ణాతీతమని పేర్కొన్నారు. పాదయాత్రకు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.