- తానూర్‌లో అఖండ హరినామ సప్తాహం ముగింపు వేడుకలు
- ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత: శివాజీ మహారాజ్
- తల్లిదండ్రుల సేవను మించిన పవిత్ర కార్యం లేదని ఆయన వ్యాఖ్యలు
నిర్మల్ జిల్లా తానూర్‌లో అఖండ హరినామ సప్తాహం ముగింపు వేడుకల్లో పాల్గొన్న హ.ప.భ శివాజీ మహారాజ్ ఆధ్యాత్మిక చింతన అవసరాన్ని ప్రముఖంగా పేర్కొన్నారు. దైవ నామస్మరణతో మనసిక ప్రశాంతత సాధ్యమని, సన్మార్గంలో నడవాలని సూచించారు. తల్లిదండ్రుల సేవ పవిత్రమని, వారి బాధకు కారణమైతే అది పాపమని హెచ్చరించారు. అన్నదానం, మహప్రసాద పంపిణీతో కార్యక్రమం ముగిసింది.
తానూర్, నవంబర్ 15 (ఎమ్4 న్యూస్):
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో గత వారం రోజులుగా నిర్వహించిన అఖండ హరినామ సప్తాహం శుక్రవారం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన హ.ప.భ శివాజీ మహారాజ్ పాల్గొని భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు.
మహారాజ్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని సూచించారు. ఆధ్యాత్మిక భావనలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని, దైవ నామస్మరణ మనం భగవంతునికి ప్రియమైన వారిగా మారడానికి సహాయపడుతుందని వివరించారు. గ్రామ ప్రజలంతా సన్మార్గంలో నడవాలని, ఆధ్యాత్మికత వల్ల క్రమశిక్షణ, మంచి జీవన విధానం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
తల్లిదండ్రుల సేవ ప్రాముఖ్యత:
తల్లిదండ్రుల సేవ పవిత్రమైన కర్తవ్యమని, వారిని బాధ పెట్టడం పెద్ద పాపమని మహారాజ్ పేర్కొన్నారు. “తల్లిదండ్రుల ప్రేమకు సమానమైనది ఏదీ ఉండదు. వారు మన జీవితానికి మూలాధారమైన వారని గుర్తించాలి,” అని ఆయన అన్నారు.
వీడ్కోలు కార్యక్రమంలో ఉట్టి కొట్టి మహప్రసాదాన్ని పంపిణీ చేసి, పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ఇతర గ్రామాల భక్తులు పాల్గొన్నారు.