ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో పెరుగుతున్న ఉపరితల ఉష్ణోగ్రతల నేపథ్యంలో 'సూపర్ ఎల్ నినో' ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మే రెండో వారం నుంచే దీని ప్రభావం ప్రారంభమై, జులై నాటికి మరింత తీవ్రతరం కావచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇది 1876-77 నాటి భయంకరమైన కరువు పరిస్థితులను పునరావృతం చేస్తుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయ వాతావరణ సంస్థలు, అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ ఏజెన్సీ (ఎన్వోఏఏ), బ్రిటన్ వాతావరణ శాఖ, యూఎస్ క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్లు సూపర్ ఎల్‌నినోపై హెచ్చరికలు జారీ చేశాయి. తొలుత జూన్ రెండో వారం నాటికి ఎల్‌నినో పరిస్థితులు బలపడతాయని అంచనా వేసినా, ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మే రెండో వారం లేదా జూన్ మొదటి వారానికే ఇది బలపడవచ్చని డబ్ల్యూఎంవో అంచనా వేసింది. జులై నాటికి ఇది మరింత తీవ్రతరం కావచ్చని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది వచ్చే ఎల్‌నినో చాలా తీవ్రంగా ఉంటుందని డబ్ల్యూఎంవోలోని క్లైమేట్ ప్రెడిక్షన్ చీఫ్ విల్ఫ్రాన్ మౌఫౌమా ఓకియా తెలిపారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతున్నాయని, ఇది సాధారణ ప్రభావమేనని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, జులై లేదా సెప్టెంబర్ నాటికి ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కంటే ఎక్కువగా పెరిగితే, సూపర్ ఎల్‌నినో పరిస్థితులకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ సారి వచ్చే ఎల్‌నినో ఏడాదిపాటు కొనసాగే అవకాశం ఉందని, చరిత్రలో నమోదైన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్నినోల్లో ఇది కూడా ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. 1876-77లో సంభవించిన సూపర్ ఎల్‌నినోతో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు ప్రాణాలు కోల్పోయారని గణాంకాలు తెలుపుతున్నాయి. భారతదేశంలోనే 96 లక్షల మందికి పైగా కరువుతో మరణించినట్లు నమోదైంది. ఈ కరువు ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై, వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడిందని, లక్షలాది మంది వలస వెళ్లారని చరిత్ర చెబుతోంది. 1982, 1997, 2015లలోనూ తీవ్రమైన ఎల్నినోలు వచ్చినా, 1877 నాటి తీవ్రత లేదని, ఇప్పుడు వచ్చే ఎల్‌నినో ఆ స్థాయి తీవ్రతను కలిగి ఉంటుందేమోనని సైంటిస్టులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణపై కూడా ఎల్ నినో ప్రభావం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షపాతం 87-92 శాతానికి పరిమితమయ్యే అవకాశం ఉందని, ఇది సాధారణం కంటే తక్కువని తెలుస్తోంది. మహారాష్ట్ర, కర్నాటకలో వర్షాలు సరిగా పడకపోతే, కృష్ణా, గోదావరి నదుల్లోకి వరదలు తగ్గి, ప్రాజెక్టులు నిండడం కష్టమవుతుందని, ఇది రాష్ట్ర సాగునీటి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఐఎండీ అధికారులు పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వర్షపాతం లోటు, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, దక్షిణాది జిల్లాలకు పెద్దగా ప్రభావం ఉండదని అంచనా వేస్తున్నారు. మే రెండో వారంలో ఇచ్చే వాతావరణ అంచనాల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.












