“ఒక్క మొక్క - ఒక్క ఊపిరి” నినాదంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం 2026 కార్యక్రమం నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్వయంగా మొక్క నాటి ఈ ఉద్యమానికి నాంది పలికారు.
ముఖ్యమంత్రి రంగారెడ్డి, జిల్లా గుర్రంగూడ నుండి వర్చువల్గా ఈ జాతీయ ఉద్యమాన్ని ప్రారంభించగా, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఐఏఎస్, మామడ మండలం రాయదారి బోరిగాం అటవీ ప్రాంతంలో మొక్క నాటారు.
మొక్కలు నాటడమే కాకుండా, వాటిని సంరక్షించడం అసలైన దేశభక్తి అని కలెక్టర్ నొక్కి చెప్పారు. ప్రతి ఇంటి ముందు, పొలం గట్టున, బడి ఆవరణలో ఒక్క మొక్క అయినా నాటాలని, హరిత తెలంగాణ లక్ష్యంలో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శ్రీ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఐఎఫ్ఎస్, పీడీ విజయలక్ష్మి, డీఏవో అంజి ప్రసాద్, ఎఫ్ఓ శివకుమార్, మామడ తహసీల్దార్, ఎంపీడీవో, సర్పంచులు, విద్యార్థులు, రైతులు, అటవీ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
వన మహోత్సవం 2026లో భాగంగా జిల్లా వ్యాప్తంగా లక్షల మొక్కలు నాటాలని, ప్రతి మొక్కకు మూడు సంవత్సరాల పాటు సంరక్షణ బాధ్యత తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, నేడు నాటే చిన్న మొక్కే రేపటి తరానికి పెద్ద ఊపిరి అని కలెక్టర్ పేర్కొన్నారు.












