ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పర్యావరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, అలాగే రానున్న వర్షాకాలానికి సన్నద్ధత ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాదు నుంచి రాష్ట్ర డిజిపి సి.వి ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిఎస్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అన్ని కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలని, పర్యావరణ వారోత్సవాలు విజయవంతం కావాలని ఆయన సూచించారు.
ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో గ్రామ, వార్డు సభలను ఏర్పాటు చేసి ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ముఖ్యంగా రైతులకు రానున్న వర్షాకాలం, వాతావరణ పరిస్థితులు, పంటల సాగు వంటి విషయాలను వివరించాలని, ఎస్ఐఆర్ ప్రక్రియపై కూడా అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు.
గ్రామ సభలలో మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న వర్షాకాలం, ఆకస్మిక వరదలు, విపత్కర పరిస్థితులపై అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, పర్యావరణ వారోత్సవాలను పకడ్బందీగా నిర్వహిస్తామని, వర్షాకాల దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామ, వార్డు సభలు, ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అనంతరం తహసిల్దార్లతో నిర్వహించిన సమావేశంలో పెండింగ్ భూభారతి, సాదా బైనామా దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.












