నిర్మల్ జిల్లా, బాసర మండల కేంద్రంలోని ఒక దుకాణంలో సుమారు ఎనిమిది అడుగుల పొడవున్న భారీ పాము ప్రత్యక్షమవడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది.
మండల కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీను పటేల్‌కు చెందిన దుకాణంలో ఈ ఘటన జరిగింది. దుకాణంలో పని జరుగుతుండగా అకస్మాత్తుగా పాము కనిపించడంతో యజమానితో పాటు అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన దుకాణ యజమాని, గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ ఫయాజ్‌కు సమాచారం అందించారు. ఫయాజ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చాకచక్యంగా పామును పట్టుకుని సంచిలో బంధించారు. దీంతో స్థానికులు ఉపశమనం పొందారు.
స్నేక్ క్యాచర్ ఫయాజ్ మాట్లాడుతూ, వేసవిలో వేడి కారణంగా పాములు చల్లదనం కోసం ఇళ్లు, దుకాణాల్లోకి వస్తుంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పామును అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.












