East Godavari/Gokavaram (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 21
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఇరుముడి సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే యాక్షన్, క్రైమ్, ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఆడపిల్లల సమస్యలపై పోరాటం వంటి అంశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది.
రవితేజ, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన ఇరుముడి సినిమా ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ నిర్మించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర, సాయి కుమార్, శ్వాసిక, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
త్రినాథ్ (రవితేజ) తన భార్య కావేరి (ప్రియా భవాని శంకర్), కూతురు మణికంఠ (నక్షత్ర)తో కలిసి సీలేరు దగ్గర అరటిపళ్ళ వ్యాపారం చేస్తుంటాడు. కూతురంటే అమితమైన ప్రేమ కలిగిన త్రినాథ్, ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధరిస్తాడు. అయితే, ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా, ఏడిపించినా వారిని తన కూతుళ్లుగా భావించి, వారిని ఏడిపించేవారిపై పోరాడుతుంటాడు. దీంతో అతనికి చాలామంది శత్రువులు తయారవుతారు. మణికంఠ చదువుకుంటున్న స్కూల్లో ఆడపిల్లలు చనిపోవడం, స్కూల్ టీచర్ ధనలక్ష్మి కఠినంగా వ్యవహరించడం వంటి సంఘటనలు త్రినాథ్ దృష్టికి వస్తాయి. మణికంఠకు తెలిసిన నిజాలు, వాటిని తండ్రికి చెప్పే క్రమం, టీచర్ పాత్ర, త్రినాథ్ మాల సమయంలో ఎదుర్కొనే సవాళ్లు కథను ఆసక్తికరంగా మలుస్తాయి.
అయ్యప్ప మాల నేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్నారని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మల్లెపూల పల్లకి వంటి అయ్యప్ప పాటలు, ఆకట్టుకునే ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమాకు పాజిటివ్ వైబ్ తెచ్చాయి. ఫస్ట్ హాఫ్ అందమైన గ్రామీణ వాతావరణం, తండ్రీకూతుళ్ల అనుబంధంతో సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్, సెకండ్ హాఫ్ లో మల్లెపూల పల్లకి పాటతో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఆడపిల్లల భావోద్వేగాలపై సాగే కథనం, ఊహించని ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయ్యప్ప స్వామి ఎపిసోడ్స్, యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. అమ్మాయిలను ధైర్యంగా పెంచాలి, ఇంట్లో వారికి చెప్పాలి అనే సందేశాన్ని చక్కగా చూపించారు. అయితే, పోలీసుల పాత్రపై లాజిక్ సందేహాలు తలెత్తుతాయి. మందు తాగడం వల్ల కలిగే నష్టాలను కూడా ప్రస్తావించారు. సినిమా ముగింపులో మణికంఠ పాత్ర చెప్పిన డైలాగ్ తో కథ పరిపూర్ణమైన భావన కలుగుతుంది. పల్లెల్లో, బి, సి సెంటర్లలో సినిమా బాగా ఆడే అవకాశం ఉంది. మహిళలు, అయ్యప్ప మాల భక్తులు, కూతుళ్లు ఉన్న తండ్రులు ఈ సినిమాతో బాగా కనెక్ట్ అవుతారు. కమర్షియల్ గా చూస్తే, కార్తీక మాసం, అయ్యప్ప మాల సీజన్ లో రిలీజ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ రీచ్ ఉండేదనిపిస్తుంది. చాన్నాళ్ల తర్వాత రవితేజ హిట్ కొట్టాడని చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమా.
రవితేజ తన నటనతో అదరగొట్టాడు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నింట్లోనూ మెప్పించాడు. అయ్యప్ప మాల వేసిన భక్తుడిలా ఒదిగిపోయాడు. మిడిల్ క్లాస్ తండ్రిగా, మామూలు వ్యక్తిగా, మందు తాగే వ్యక్తిగా తన పాత్రలో జీవించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్ర అద్భుతంగా నటించింది. మలయాళీ అయినప్పటికీ తెలుగు డబ్బింగ్ లోనూ తన నటనతో ఆకట్టుకుంది. రవితేజ, నక్షత్రల తండ్రీకూతుళ్ల బంధం అలరిస్తుంది, నక్షత్ర పాత్ర ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది. ప్రియా భవాని శంకర్ మిడిల్ క్లాస్ గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. సాయి కుమార్ గురుస్వామి పాత్రలో ఒదిగిపోయారు. శ్వాసిక, జబర్దస్త్ కొమరం తమ నెగిటివ్ షేడ్స్ లో మెప్పించారు. లాస్య, లోకేష్, అజయ్ ఘోష్, రమణ భార్గవ్, మహేష్, లక్ష్మణ్ మీసాల, ఎమ్మెల్యే పాత్రధారి సహా మిగతా నటీనటులు తమ పాత్రల్లో బాగానే నటించారు.











