elangana Bandh: తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ మద్దతు… కేటీఆర్ కీలక కామెంట్స్…
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా బీసీ సంఘాలు జరపనున్న రాష్ట్ర బంద్‌కు బీఆర్ఎస్ మద్దతిచ్చింది. వివరాలు…
అక్టోబర్ 18వ తేదీన బీసీ సంఘాలు జరపనున్న బంద్‌కు మద్దతు కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను బీసీ సంఘాల నేతలు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… జాతీయ స్థాయిలో ఓబీసీ సంక్షేమ శాఖ ఉండాలని కోరిన ఏకైక తొలి నాయకుడు కేసీఆర్ అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపైన తమ పార్టీ విధానాన్ని చాలా స్పష్టంగా తాము చెప్పామని తెలిపారు. గతంలో శాసనసభలో రెండుసార్లు రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి పంపించిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రచారం చేసుకోలేదని విమర్శించారు.
కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా రిజర్వేషన్లు పెడతామని శాసనసభలో చెప్పినప్పుడు తాము కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇచ్చామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మంచిది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లపైన ఐదు రకాలుగా మాట్లాడుతోందని విమర్శించారు. రాజ్యాంగ సవరణ ద్వారా, పార్టీ తరఫున రిజర్వేషన్లు ఇస్తామని, ఆర్డినెన్స్ ద్వారా, బిల్లు ద్వారా, మరోసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్లు వస్తాయని చెబుతుందని మండిపడ్డారు. ఇన్ని రకాలుగా మాటలు మార్చిన కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని తాము తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.
బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చిందని చెప్పారు. తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా త పార్టీ తరఫున నిలదీస్తూనే ఉంటామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల ప్రతి ప్రయత్నాన్ని తమ పార్టీ తరఫున సపోర్ట్ చేస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నన్ని రోజులు, ఆయన నాయకత్వంలో రానే రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేదాకా నిలదీస్తూనే ఉంటామని అన్నారు.
బీసీ డిక్లరేషన్లు ఇస్తామని చెప్పిన లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ నుంచి మొదలుకొని బీసీ సబ్‌ప్లాన్ వంటి హామీలపైన నిలదీస్తూనే ఉంటామని అన్నారు. కాంగ్రెస్ తెచ్చిన 42 శాతంరిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల కోసం తీసుకువచ్చారు కానీ, విద్య, ఉపాధికి సంబంధించిన రిజర్వేషన్ల వాటా మిగిలిన అన్ని రంగాల్లో రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంట్రాక్టులనుంచి మొదలుకొని అన్నింటికి సంబంధించిన వాటిలో 42 శాతం వాటా రావాలి అని బీసీ సమాజం డిమాండ్ చేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాల అమలుపైన మనం నిలదీయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీసీ సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి పైన నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ, మోదీ ఇద్దరూ కలిసి ఒక్క మాట అంటే ఒక్క నిమిషంలో బీసీ రిజర్వేషన్ల అంశం తేలిపోతుందని అన్నారు. ఇండి కూటమి, ఎన్డీయే రెండు కూటములు కలిస్తే బీసీ రిజర్వేషన్ బిల్లు వెంటనే చట్టంగా మారుతుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యమం మాదిరే, సమస్యను ఢిల్లీ దాకా తీసుకువెళ్లి తెలంగాణ సాధించుకున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లను సాధించుకుందామని పిలుపునిచ్చారు. అక్టోబర్ 18వ తేదీన బీసీ సంఘాలు నిర్వహించే బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.