సర్పంచ్ ఎన్నికలపై బకాయిల ఎఫెక్ట్!
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – హైదరాబాద్
📌 అక్టోబర్ 31 నుంచి మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకూ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ వేడి మొదలైంది. అయితే గత బీఆర్ఎస్ పాలనలో నిధుల సమస్యలతో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటికీ మదిలో ఉండటంతో, నేతలు సర్పంచ్ బరిలోకి దిగేందుకు వెనకడుగు వేస్తున్నారు.
💥 అప్పుల కష్టాలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండానే అభివృద్ధి పనులు చేయాలని సర్పంచులను ఒత్తిడి చేసింది. దీంతో వారు అప్పులు చేసి పనులు చేపట్టారు. కానీ బిల్లులు రాకపోవడంతో అనేకమంది సర్పంచులు అప్పుల భారంతో కూరుకుపోయి, ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
💥 బుజ్జగిస్తున్న పార్టీలు
రిజర్వేషన్లు ఖరారవడంతో, పోటీ చేయమని పార్టీలు కోరుతున్నా నాయకులు స్పష్టంగా నిరాకరిస్తున్నారు. “ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, పనుల కోసం తిరగడం – ఇవన్నీ ఇక మాకు సాధ్యం కాదు” అని అంటున్నారు. దీంతో పెద్ద నాయకులు వారిని బుజ్జగించి, భరోసా ఇచ్చి పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
💥 పండుగల ఎఫెక్ట్
దసరా, దీపావళి పండుగల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఆశావాహులు భారీ ఖర్చులకు సిద్ధమవుతున్నారు. మటన్, చికెన్ విందులు, మద్యం బాటిళ్లతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలే ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశముందని చర్చ నడుస్తోంది.