విద్యతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని, విద్యార్థులు తమ చదువుల్లో రాణించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శుక్రవారం బైంసాలోని ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీలో అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులను చదువుల్లో ప్రోత్సహించే లక్ష్యంతో గత కొన్ని సంవత్సరాలుగా అనసూయ పవర్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. పేద విద్యార్థులు చదువుల్లో ప్రతిభ కనబరిచి, వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కుటుంబంలో ఒకరు విద్యావంతులైతే ఆ కుటుంబం బాగుపడుతుందని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించినా తల్లిదండ్రులను మర్చిపోవద్దని ఆయన సూచించారు.
విద్య, వైద్యం, సాగునీరు లక్ష్యాలుగా తాను ముందుకు సాగుతున్నానని, విద్యాభివృద్ధికి కట్టుబడి ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతో ఎస్.ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ జనసంద్రంగా మారింది. ఎమ్మెల్యే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కూడా అభినందించారు.
ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, విద్యార్థులు మాట్లాడుతూ అనసూయ పవర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించడం మంచి పరిణామమని వారు అభివర్ణించారు. అనసూయ పవర్ ట్రస్ట్, ఎస్.ఎస్. స్టడీ సర్కిల్ ద్వారా నియోజకవర్గంలో వందలాది మంది యువతకు ఉద్యోగాలు లభించాయని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












