పరీక్షా పత్రాల లీకేజీకి నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనల్లో పోలీసుల బలప్రయోగంపై దాఖలైన రెండు పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను సోమవారం విచారించాలని న్యాయస్థానం నిర్ణయించింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపు మేరకు కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పాటు పలు డిమాండ్లతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జ్, భాష్పవాయువు, పెల్లెట్ల ప్రయోగం వంటి చర్యలకు దిగడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
విద్యార్థి నిరసనకారులపై పోలీసులు మితిమీరి ప్రవర్తించారని, కొన్ని నియంత్రణలు అవసరమని సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ హింసకు సంబంధించి రెండు పిటిషన్లు అధికారికంగా దాఖలయ్యాయని, వీటిని విచారణకు స్వీకరిస్తామని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. దీంతో ఈ పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ పరిణామాలపై సోషల్ మీడియాలో ఆ వీడియోలు, పోస్టులపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది.
కాంగ్రెస్ పార్టీ కూడా విద్యార్థులకు సంఘీభావం ప్రకటించి, రేపు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. విద్యార్థుల నిరసనలపై ఉక్కుపాదం, వాట్సాప్ నోటీసులు, ఇళ్లలో తనిఖీలు వంటి చర్యలు వివాదాస్పదంగా మారాయి.












