నిర్మల్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో శ్రీరామనవమి మరియు సరస్వతీ విద్యాపీఠ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యక్షులు దేవర్ల సంతోష్, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ ఉత్తర్వార్ రాజేందర్ పలువురు విద్యార్థులకు స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
పాఠశాల నిర్వహణ సంఘం అధ్యక్షులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు దేవర్ల సంతోష్ మాట్లాడుతూ, శ్రీరాముని జీవితం భారత ప్రజలందరికీ ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. రామునిలోని ప్రేమ, సహనం, స్నేహం, నాయకత్వ లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అలాగే ఆయన అనుసరించిన విలువలను జీవితంలో పాటించడం అవసరమని తెలిపారు.
ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహ ఉత్తర్వార్ రాజేందర్ మాట్లాడుతూ, సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలు విద్యార్థులలో నైతిక విలువలు, సదాచారం, దేశభక్తి పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. శ్రీరాముని ఆదర్శాలను అనుసరించేలా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ పాఠశాలల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, గురుకుల పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందిన విద్యార్థులను అభినందించారు. పాఠశాల కార్యదర్శి సామన్పెల్లి సుదర్శన్, ప్రధానాచార్యులు మరాఠీ సంతోష్ కుమార్, పలువురు ఆచార్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








