మెండోరా మండలం దూదిగాం గ్రామ సర్పంచ్ హరోన్ రషీద్ బాబా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని గ్రామస్థులకు పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
దూదిగాం గ్రామంలో జరిగిన సమావేశంలో సర్పంచ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చేరేలా గ్రామస్థులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామస్థాయి విద్యాభివృద్ధికి విద్యాశాఖ ఎల్లప్పుడూ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వారు విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రాజ్ సునంద మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించి కల్పించిన సౌకర్యాలను విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










